ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పటిష్ఠం చేసేలా చర్యలు చేపట్టింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ). ఇందుకోసం 'అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనావళి-2019' ముసాయిదాను రూపొందించింది.
కళాశాలలు విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ (ఎస్జీఆర్సీ) సిఫార్సులను విధిగా పాటించేలా ముసాయిదాలో కొత్త నింబంధనలు ప్రతిపాదించింది. ఏదైనా కళాశాల నిబంధనలు పాటించటంలో విఫలమైతే... విద్యాసంస్థల గుర్తింపు రద్దు, ఏఐసీటీఈ నుంచి వచ్చే గ్రాంట్ల ఉపసంహరణ, ఇప్పటికే కేటాయించిన గ్రాంట్ల నిలిపివేత వంటి చర్యలు తీసుకోనుంది. వాటితో పాటు ప్రత్యేక సహాయ కార్యక్రమాల కింద లబ్ధి పొందేందుకు ఆ విద్యాసంస్థలు అర్హత కోల్పోతాయి.
నూతన నిబంధనల ముసాయిదాపై ఆగస్టు 20లోపు సలహాలు, సూచనలు చేయాలని భాగస్వామ్య పక్షాలకు సూచించింది ఏఐసీటీఈ.
నూతన నియమాల ప్రకారం ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రతి విద్యాసంస్థ 'విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ'ని ఏర్పాటు చేయాలి. విద్యార్థుల నుంచి సంస్థపై ఏదైనా ఫిర్యాదు అందితే.. కమిటీ విచారణ చేపట్టి 15 రోజుల్లోపు నివేదిక పంపించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ సేవలు