నోట్ల రద్దు.... మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో ఒకటి. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఈ విషయం తమిళనాడుకు చెందిన ఇద్దరు వృద్ధులకు మాత్రం తెలియదు. వారే... తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని పూమలూర్ గ్రామానికి చెందిన రంగమ్మళ్(73), తంగమ్మళ్(78). ఇద్దరూ తోబుట్టువులు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్‌ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు
దాదాపు 20 ఏళ్లుగా పశువులను అమ్మడం, పొలంలో కూలి పని చేయడం ద్వారా వచ్చే డబ్బుతో దాదాపు రూ.46 వేలు కూడబెట్టుకున్నారు. ఈ మొత్తంలో రంగమ్మళ్ రూ. 24 వేలు, తంగమ్మళ్ రూ. 22 వేలు పోగు చేశారు. వారి అంత్యక్రియలకు, మనువళ్లు, మనువరాళ్లకోసం ఈ సొమ్మును దాచుకున్నారు. కుమారులకు మద్యం సేవించే అలవాటు ఉన్నందున.. వారికి ఈ విషయం చెప్పకుండా, ఇంట్లోని బియ్యం బస్తాలు, అల్యూమినియం పెట్టెలు, నడుముకు కట్టుకునే సంచుల్లో డబ్బు దాచుకుంటూ వచ్చారు.
తంగమ్మళ్కు ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. చికిత్స కోసం దాచుకున్న డబ్బును బయటకు తీశారు. తీరా చూస్తే ఆ నోట్లు మూడేళ్ల క్రితమే రద్దయ్యాయని తెలిసింది. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం జిల్లా కలెక్టర్ విజయ్ కార్తికేయన్ వరకు చేరింది. ఆయన చొరవతో ఆ ఇద్దరు వృద్ధులకు వైద్య సాయం, పింఛను అందుతున్నాయి.
" నా పేరు రంగమ్మళ్, వయసు 73 ఏళ్లు. నా భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయారు. నాకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. మా సమస్య తెలుసుకుని కలెక్టర్ స్పందించారు. వైద్య చికిత్స అందించాల్సిందిగా పెరునురాయ్ వైద్య కళాశాలకు లేఖ రాశారు."
- రంగమ్మళ్, పాతనోట్లు దాచుకున్న వృద్ధురాలు
తంగమ్మళ్, రంగమ్మళ్కు సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇరువురికి కలిపి రూ.46వేల చెక్ అందించింది.
2016 నవంబరు 8న నోట్లు రద్దు
ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ 2016 నవంబరు 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను తెచ్చింది.