లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు స్తంభించిపోయాయి. దీంతో తయారీ కేంద్రాల్లో మద్యం నిల్వలు పేరుకుపోయి.. ఏకంగా ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు వృథా అయ్యే ప్రమాదముంది. బార్‌లు, క్లబ్‌లలో లభ్యమయ్యే ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉండటం వల్ల నిల్వ కోసం తంటాలు పడుతున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో కరెంటు, ఇతర ఖర్చులు మీదపడుతున్నందున తయారీ కేంద్రాలకు నష్టాలు తప్పడం లేదు. తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 250 మైక్రో బ్రూవరీలు.. తమ నిల్వలను ఖాళీ చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఇప్పటికే హరియాణా గురుగ్రామ్‌లోని కొన్ని కేంద్రాలు పారబోత మొదలుపెట్టాయి.
తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని..
క్రాఫ్ట్ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. ప్రస్తుతం అన్ని ప్లాంట్లలో కలిపి ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్ బీర్ నిల్వలున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇదంతా పాడవుతుంది. ఈ నేపథ్యంలో మైక్రో బ్రూవరీస్ వ్యాపారం దెబ్బతినకుండా.. గ్రోలర్స్(పెద్ద సీసాలు) సాయంతో టేక్-అవే సదుపాయానికి అనుమతించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. సుమారు 35 దేశాల్లో ఈ తరహా సౌకర్యం ఉన్నట్లు అసోసియేషన్ మహారాష్ట్ర అధ్యక్షుడు నకుల్ భోంస్లే చెప్పారు.
రూ.700 కోట్ల విలువైన మద్యం కూడా..
దీంతోపాటు దిల్లీ మినహా ఉత్తర భారతదేశంలో రూ.700 కోట్ల విలువైన విదేశీ మద్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. గత ఆర్థిక సంవత్సరాంతానికే ఈ నిల్వలు ఖాళీ కావాల్సిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కాహాలిక్ బీవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలిపింది. పాత స్టాక్ విక్రయాలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరమని పేర్కొంది. మరోవైపు సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతించిన కేంద్రం... దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అమర జవాన్లకు ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు