మనిషి బతకడానికి తిండికన్నా ముఖ్యమైంది తాగునీరు. గొంతెండిపోయి, జీవజలధారకు నోచని స్థితిలో ఎన్నోరోజులు ప్రాణాలు నిలవవు. తాగునీరు పొందడం దేశపౌరుల జీవనహక్కుగా సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో స్పష్టీకరించిందన్నా; ప్రజానీకానికి తాగునీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యతగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తాజాగా అభివర్ణించారన్నా- కారణమదే! భాగ్యనగర సందర్శనలో కేంద్ర జల్‌శక్తి శాఖామాత్యులు, ‘మిషన్ భగీరథ’ తరహాలో దేశవ్యాప్తంగా ఇంటింటికీ సురక్షితమైన మంచినీటిని సమకూర్చాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జల్‌జీవన్ మిషన్’ పేరిట 2024 సంవత్సరం నాటికి దేశంలోని 14.60 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా నీరందించదలచినట్లు షెకావత్ చెబుతున్నారు. అందుకయ్యే వ్యయం రూ.3.60లక్షల కోట్లని అంచనా. వాస్తవానికిది, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెలుగుచూసిన ప్రతిపాదన. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ రాష్ట్రాలతో చేతులు కలిపి ‘నల్ సే జల్’ పథకాన్ని అమలుచేయదలచినట్లు, ఆయా రాష్ట్రప్రభుత్వాల ప్రాథమ్యాలకు అనుగుణంగానే ‘జల్ జీవన్ మిషన్’ను పట్టాలకు ఎక్కించనున్నట్లు మూడు నెలలక్రితమే కథనాలు వెలువడ్డాయి. ఎంత ఖర్చవుతుందో బహిర్గతం చేసిన షెకావత్, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతోనే యోజన పూర్తవుతుందని ఇప్పుడు తేటపరచారు. దేశంలోని 256జిల్లాలు, 1,592 బ్లాకుల్లో భూగర్భజలాల సంరక్షణకు ‘జల్‌శక్తి అభియాన్’ ప్రకటించి స్థానిక సంస్థలకు మార్గదర్శకాల్ని క్రోడీకరించిన కేంద్రం ఇకమీదట రాష్ట్రాలతో జట్టుకట్టి జనావాసాల దాహార్తి తీరుస్తామంటోంది. అనవసర హంగూ ఆర్భాటాలకు చేసే వృథావ్యయాన్ని రాష్ట్రాలు తగ్గించుకుని ఆ మొత్తాన్ని అత్యవసరమైన నీటి పద్దుకు మళ్ళించగలిగితే కోట్లాది జనబాహుళ్యం తెరిపిన పడుతుంది!
దిద్దుబాటు చర్యలు పుంజుకోవాలి
నెత్తిన కడవలతో కాలినడకన కిలోమీటర్ల తరబడి సాగుతూ, నీటికోసం వేటలో డస్సిపోతున్న అభాగ్యుల నరకయాతన మాటలకందనిది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లలు కలిసి అలా రోజూ వెచ్చిస్తున్న సమయం దాదాపు 20 కోట్ల పనిగంటలని, అది 22 వేల ఎనిమిది వందల సంవత్సరాలకు సమానమని ఆ మధ్య ‘యునిసెఫ్’ లెక్కకట్టింది. కేంద్రమే లోక్‌సభాముఖంగా ప్రకటించిన వివరాల ప్రకారం- 21 రాష్ట్రాల్లోని 153 జిల్లాల వాసులు మోతాదు మించిన ఆర్సెనిక్‌తో కూడిన జలాలనే సేవిస్తున్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు దారితీసే యురేనియం నిల్వలతో 16 రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు కలుషితమైనట్లు నిరుటి డ్యూక్ విశ్వవిద్యాలయ అధ్యయన నివేదిక నిగ్గు తేల్చింది. దేశజనాభాలో 60 కోట్లమంది నీటి కటకటతో సతమతమవుతున్నట్లు ‘నీతి ఆయోగ్’ గణాంకాలే చెబుతున్నాయి. పల్లె పట్టణమన్న తేడా లేకుండా కలుషిత జలాల ఉరవడి, అనేక నగరాల్లో ‘కేప్ టౌన్’ దుస్థితిని స్ఫురింపజేస్తూ నీటి ఎద్దడి- మనిషి కనీసావసరమైన తాగునీటిని సురక్షితంగా అందించడంలో ప్రభుత్వాల ఘోర వైఫల్యాల్ని కళ్లకు కడుతున్నాయి. దేశంలో పావన జీవనగంగతోపాటు వందలాది నదులు, వేలాది జలప్రవాహాలను- టన్నులకొద్దీ పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలు విషకలుషితం చేసేస్తున్నాయి. జల సంరక్షణ బాధ్యతను గాలికొదిలేస్తే భూగర్భ నిల్వలు అడుగంటి మున్ముందు జలాశయాలు బోసిపోతాయన్న హెచ్చరికల నేపథ్యంలో- ఇకనైనా దిద్దుబాటు చర్యలు వేగం పుంజుకోవాలి. ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిన మిహిర్ షా నేతృత్వాన నెలకొన్న సంఘం ఆరు నెలల్లో నూతన జాతీయ జల విధాన ముసాయిదా సమర్పించనుందంటున్నారు. భిన్న సమస్యల్ని క్షుణ్నంగా విశ్లేషించి దేశంలో బాధ్యతాయుత జల సంస్కృతికి ఒరవడి దిద్దాల్సిన కీలక భూమికను షా కమిటీ సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంది.
నూతన జలసంస్కృతి పాదుకోవాలి
ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికా వంటివి భూగర్భ జలమట్టాలు తరిగిపోకుండా కాచుకుంటూ వాడకంలో పొదుపు పాటిస్తున్నాయి; నీటి ఎద్దడి తలెత్తకుండా కాలుష్యం దాపురించకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వివిధ నదీతీరాలు, పలు నగరాల్లో 2030 నాటికి 95 శాతం జలనాణ్యత సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్న చైనా- ఏ నీటి వనరూ కాలుష్యం బారిన పడకుండా నివారించడానికి సుమారు 12లక్షల మందికి ప్రత్యేక సంరక్షక బాధ్యతలు కట్టబెట్టింది. ఇన్నాళ్లూ అటువంటి నిర్ణయాత్మక చొరవ మచ్చుకైనా కానరాని ఇక్కడ, డెబ్భై ఏళ్లకు పైగా స్వపరిపాలనలో జాతి అపార జల సౌభాగ్యాన్ని కోల్పోయింది. ఈ దురవస్థను బదాబదలు చేసేలా దేశంలో నూతన జలసంస్కృతి పాదుకోవాలి. రైతుల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరిలో నీటి పొదుపు ప్రాణావసరమన్న స్పృహ వేళ్లూనుకోవాలి. జల సంరక్షణ, దుబారా నివారణలకు పాఠ్యాంశాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించి లేత బుర్రల్లో సామాజిక చేతన బీజాలు మొలకెత్తించాలి. మునుపటి జలవిధానాల్లో ఎన్ని ఘనతర సంకల్పాలు వల్లెవేసినా నీటివనరుల సంరక్షణకు అవేమీ పెద్దగా అక్కరకు రానేలేదు. జలగండాన్ని నివారించడంలో కాలుష్య నియంత్రణ మండళ్లు చతికిలపడి, అవినీతి కూపంలో మునకలేయడం సంవత్సరాల తరబడి చూస్తున్నాం. వాననీటి సంరక్షణ, దేశం నలుమూలలా జలాల వినియోగం, పునర్వినియోగాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవడం ఎంత ముఖ్యమో- పకడ్బందీగా అమలు పరచడానికి సకల పక్షాల కట్టుబాటు అంతకన్నా కీలకం. అత్యంత ప్రమాదకర ‘ఈ-కొలి’ పేరుకుపోయి పెద్దయెత్తున కొళాయిల్లోని నీరూ మానవ వినియోగానికి పనికిరాదనిపించుకునే దుస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడితేనే- రేపటి తరాలపట్ల ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించినట్లవుతుంది!