ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకు భారత్ పుట్టినిల్లు. క్రమక్రమంగా భారతీయ విశ్వవిద్యాలయాల ప్రమాణాలు అడుగంటిపోతున్నాయి. 2020 సంవత్సరానికి ‘క్యూఎస్’ ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. తొలి 200 విశ్వవిద్యాలయాల్లో భారత్ నుంచి ఐఐటీ (ముంబయి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), ఐఐటీ (దిల్లీ) మాత్రమే చోటు సంపాదించుకున్నాయి. దేశంలో ఉన్నత విద్యాసంస్థ ప్రమాణాల తీరుతెన్నులు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ ర్యాంకులే నిదర్శనం.
ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించే ముందు దేశీయ అవసరాలకు తగ్గట్లుగా, ప్రమాణాల పరంగా ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలను మన దేశంలోనూ అమలుచేసే దిశగా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సంప్రదాయ కోర్సుల స్థానంలో కాలానుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే సాంకేతిక అంశాలతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టాలి. అప్పుడు విశ్వవిద్యాలయాలు నిరుద్యోగుల్ని తయారు చేసే కేంద్రాలుగా కాకుండా ఉత్తమ మానవ వనరుల తయారీ సంస్థలుగా విరాజిల్లుతాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ పరంగా చూస్తే భారత్ ఏడో స్థానంలో ఉంది. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ముందంజలో ఉంది. అంకుర పరిశ్రమల స్థాపనలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు గుర్తింపు పొందాయి. భారతీయ మూలాలు గల సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ తమతమ రంగాల్లో చెరగని ముద్ర వేశారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ‘ఫార్చ్యూన్ 500’ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఆంగ్లంలో మాట్లాడటంలో భారతీయ విద్యార్థులు చైనాతో పోల్చితే చాలా మెరుగ్గా ఉన్నారు. భిన్న సంస్కృతి, భాషలు, సంప్రదాయాలు, మతాలు కలిగి ఉండటం భారత్‌కు సానుకూల అంశంగా పేర్కొనవచ్చు.
విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యంగా
స్టడీ ఇన్ ఇండియా (భారత్‌లో విద్యాభ్యాసం) పథకం కింద దేశంలో సుమారు 70వేల విదేశీ విద్యార్థులు ఉన్నట్లు అంచనా. దీన్ని 2022 సంవత్సరానికి రెండు లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా కొన్ని విశ్వవిద్యాలయాలు రుసుముల మినహాయింపు, ఉపకార వేతనాలు ఇవ్వడం ద్వారా విదేశీ విద్యార్థులను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
2015 నుంచి రంగాలవారీగా బోధనలో నిష్ణాతులు, వ్యాపార ప్రముఖులు, శాస్త్రవేత్తలను ప్రపంచ ప్రఖ్యాత సంస్థలనుంచి ఆహ్వానించడం ప్రారంభించారు. స్పార్క్ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసర్చ్ కొలాబరేషన్) ద్వారా 500 ప్రపంచస్థాయి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకొనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోని వందలోపు ర్యాంకున్న విద్యాసంస్థలకు పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం కల్పించేందుకు చర్యలు చేపట్టడం హర్షించదగ్గ విషయం. ఈ విశ్వవిద్యాలయాలతో మిగతా విశ్వవిద్యాలయాలను అంతర్జాలం ద్వారా అనుసంధానం చేసి అందరికీ నాణ్యమైన ఉన్నతవిద్య అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. మెరుగైన విద్యావిధానం, సౌకర్యాల కల్పన ద్వారా అమెరికా లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆకర్షిస్తున్నాయి.
లోపాలు
విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధుల కేటాయింపు, వసతులు లోపిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఆచార్య, అధ్యాపక ఖాళీలు భర్తీ కావడం లేదు. ఫలితంగా బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యంత్రాంగంలో జవాబుదారీతనం కొరవడుతోంది. పనితీరు మదింపు విషయంలో సరైన విధానాలు లోపించాయి. ఇవన్నీ ఉన్నత విద్య అభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. నైపుణ్యాల కొరతవల్ల ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు సైతం గత్యంతరం లేని స్థితిలో చిరుద్యోగాలకూ సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ కోర్సులు, కాలంచెల్లిన పాఠ్యప్రణాళికలకు బదులు వృత్తి నిపుణులను భాగస్వామ్యం చేసి, మారుతున్న విపణి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రుపొందించాల్సిన అవసరం ఉంది. అనుబంధ కళాశాలలపై విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ సైతం సరిగ్గా ఉండటం లేదు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ వేదిక ‘స్వయం’ (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్) ద్వారా ‘మూక్స్’ (మ్యాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్) వంటి వివిధ రకాల కోర్సులను చదవడానికి చర్యలు తీసుకోవడం స్వాగతించదగ్గ అంశం. ఉన్నత విద్యా ఆర్థిక సంస్థ ద్వారా పెట్టుబడులు సమకూర్చి ఉన్నత శ్రేణి సదుపాయాలు కల్పించే దిశగా ఆలోచించడం సానుకూల పరిణామం. దేశీయ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు చేపట్టి వాటి ఫలితాలు అందరికీ అందిన తరవాత విదేశీ విద్యార్థులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. తద్వారా మేధావలసలకు అడ్డుకట్ట వేయవచ్చు. అప్పుడు మేధాపరంగా విదేశాలకు దీటుగా నిలబడవచ్చు.
విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి వీసా నిబంధనలు సులభతరం చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు సమకూరతాయి. అప్పుడే దేశంలో ఉన్నతవిద్యకు పూర్వ వైభవం వస్తుంది!
- డాక్టర్ ఎం.బుచ్చయ్య
(రచయిత- వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యుడు)
ఇదీ చూడండి : అతివేగంతో కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం