ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. బెంగళూరుకు చెందిన మాల్యా సన్నిహితుడు శశికాంత్ నివాసంలో గతవారం సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీ సాయంతో మాల్యాతో శశికాంత్ జరిపిన నగదు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారం తెలిసిందని సోమవారం వెల్లడించారు ఈడీ అధికారులు. ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్(ఏఫ్ఈఓ) కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈడీ జరిపిన మొదటి దాడులు ఇవే.
రూ. 9వేల కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినట్లు మాల్యాపై ఆరోపణలున్నాయి. మాల్యాకు చెందిన సంస్థలో శశికాంత్ 2017, ఫిబ్రవరి వరకు ఉద్యోగిగా ఉన్నారు. 9 ఏళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
అక్రమ లావాదేవీలకు సంబంధించి పలు కీలక పత్రాలు, ఈమెయిల్, వాట్సాప్ సందేశాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్ కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శశికాంత్‌కు డొల్ల కంపెనీలున్నట్లు ఆధారాల్లో తేలిందని సమాచారం.
ఇదీ చూడండి: మాల్యా పిటిషన్‌పై ఆగస్టు 2న సుప్రీం విచారణ