మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సందేశారా కుంభకోణానికి సంబంధించి మూడోసారి విచారించేందుకు గరువారం ఉదయం 11.30 గంటలకు అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్లిన అధికారులు రాత్రి 10 గంటలకు బయటికి వచ్చారు.
సందేశారా సోదరుల బ్యాంకు కుంభకోణంలో సంబంధాలున్నట్లు పటేల్‌పై ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సంబంధించి మీడియాతో మాట్లాడారు అహ్మద్ పటేల్.
"దర్యాప్తు బృందం మొత్తం 128 ప్రశ్నలు అడిగింది. నన్ను, నా కుటుంబాన్ని వేధించేందుకు రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు బృందం ఎవరి ఒత్తిడితో పనిచేస్తుందో నాకు తెలియదు. వాళ్లు ఎన్ని రోజులైనా ప్రశ్నించుకోవచ్చు. నేను సిద్ధంగా ఉన్నా. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగకున్నా, సరైన ఆధారాలు లేకున్నా ఎవరో చెబితేనే ఈడీ ఈ విధంగా వ్యవహరిస్తోంది."
- అహ్మద్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేత
కరోనా నేపథ్యంలో..
ఇప్పటివరకు అహ్మద్ పటేల్‌ను జూన్ 27, 30 తేదీల్లో రెండు రౌండ్లలో కలిపి 17 గంటల పాటు 70 ప్రశ్నలు అడిగారు ఈడీ. కరోనా నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి వచ్చేందుకు నిరాకరించిన పటేల్.. తన ఇంట్లో విచారణకు అంగీకరించారు.
దర్యాప్తునకు ముగ్గురు ఈడీ అధికారులతో కొంతమంది వెళ్లారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్కు, గ్లౌజులు, శానిటైజర్లు వెంటతీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. తాజా విచారణలో అహ్మద్ పటేల్ వాంగ్మూలాన్ని హవాలా కేసు కింద రికార్డు చేసినట్లు తెలిపారు.
ఏమిటీ కుంభకోణం..
గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ.. ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటం వల్ల దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా, నితిన్ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై సీబీఐ 2017 అక్టోబర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీరవ్ మోదీకి సంబంధమున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంబకోణం కంటే సందేశారా సోదరుల కుంభకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.
ఇదీ చూడండి: 'చైనాతో పోరాడాల్సిన వేళ ప్రతిపక్షాలపై దాడులు!'