మహారాష్ట్ర వార్ధాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై భారత ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది.
భాజపా ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో తమ నాయకులను పోటీలో నిలబెట్టడానికి ప్రతిపక్షాలు భయపడతున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ప్రధాని వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, ప్రజల్లో విభజనకు దారితీసేలా ఉన్నాయని ఆరోపించింది.
కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, అభిశేక్ మను సింఘ్వీ, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఈసీకి ఐదు ఫిర్యాదులు అందించారు. ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక మోదీ కోడ్ ఉల్లంఘించటం ఇది నాలుగోసారని పేర్కొన్నారు.
ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు సరిగ్గా వెల్లడించని భాజపా అధ్యక్షుడు అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా షాను అనర్హుడిగా గుర్తించాలన్నారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల కోసం డబ్బుల పంపిణీకి కుట్ర, గిరిజన ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ కుట్రలపై ఫిర్యాదు చేశారు. ముంబయి జాయింట్ పోలీసు కమిషనర్ దేవెన్ భారతిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.