దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన ఉపఎన్నికల కొత్త షెడ్యూల్ను సరైన సమయంలో ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).
"శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉపఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీలు సరైన సమయంలో ప్రకటిస్తాం "
-ఈసీ అధికార ప్రతినిధి ట్వీట్.
దేశవ్యాప్తంగా ఓ లోక్‌సభ, 56 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిహార్‌లోని వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానంతో పాటు తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండేసి, అసోం, మధ్యప్రదేశ్, కేరళలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికలను కరోనా, వరదల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఈసీ. సెప్టెంబరు 7 నాటికి ఈ సీట్లకు 6నెలల గడువు పూర్తికానుంది. ఆ లోపే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి. మిగతా 49 స్థానాల్లో ఉపఎన్నికల నిర్వహణకు సెప్టెంబరు తర్వాత కూడా గడువుంది.
మొత్తం 57 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా లేక వాయిదా పడ్డ 8 స్థానాల్లోనే ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయంపై మాత్రం ఈసీ స్పష్టత ఇవ్వలేదు.