అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. రెండాకుల గుర్తుపై ట్రయల్ కోర్టు విచారణను నిలిపేయాలని దిల్లీ హైకోర్టు స్టే విధించింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులకు భారీగా లంచం ఇవ్వజూపారని దినకరన్‌పై అభియోగాలున్నాయి.
ఈ వ్యవహారంలో దినకరన్‌పై కేసులు పెట్టాలని పలువురు అన్నాడీఎంకే నేతలు కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ సెక్షన్120బీ (మోసపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం)తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద ట్రయల్ కోర్టు కేసు నమోదు చేసింది.
ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దినకరన్ 2018 డిసెంబరు 4న సీనియర్ న్యాయవాది అరవింద్ నిగమ్, నవీన్ మల్హోత్రాల ద్వారా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు విచారణను నిలిపేస్తూ దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా వేసింది.