ప్రవాస భారతీయులకు కేంద్రం తీపికబురు అందించింది. ఆధార్ కార్డు పొందాలంటే వేచిచూడాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సరళతరం చేసింది. ఆధార్ కార్డు పొందేందుకు 182 రోజుల పాటు వేచి చూడాలంటూ గతంలో ఉన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఫలితంగా పాస్‌పోర్టు కల్గిన ఎన్నారైలు ఎవరైనా స్వదేశానికి వచ్చినప్పుడు నేరుగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్.. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నారైలు స్వదేశానికి వచ్చిన తర్వాత లేదా ముందస్తు అనుమతితో బయో మెట్రిక్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
వారు తమ వెంట తీసుకొచ్చిన పాస్‌పోర్టునే గుర్తింపు కార్డుగా, చిరునామా, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ పాస్ పోర్టులో భారతదేశంలోని చిరునామా లేకపోతే ఆధార్ సంస్థ సూచించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
ఇదీ చూడండి: రైతుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన కేంద్రం