మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా.. ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. కోల్హాపుర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగించిన ఆయన, 56 అంగుళాల ఛాతీ గల మోదీ చేసిన సాహసాలు గతంలో ఎవ్వరూ చేయలేదని వ్యాఖ్యానించారు.
"ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎందరో ప్రధానులు వచ్చి వెళ్లారు. వారిలో ఆర్టికల్ 370 రద్దు చేసే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ, 56 అంగుళాల ఛాతీ గల మోదీ మాత్రమే ఆ పని చేయగలిగారు. దేశ ప్రగతిని ప్రపంచానికి చాటుతున్న ఏకైక ప్రధాని మోదీ. మేము ముమ్మారు తలాక్‌ను తొలగించాం, కాంగ్రెస్ విరోధించింది. పుల్వామా దాడికి సమాధానంగా మోదీ పాకిస్థాన్ ఇంట్లోకి ధైర్యంగా చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పారు."
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
ఈ సభలో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'జల్యుక్తా శివార్'ను షా అభినందించారు. అనంతరం కోల్హాపుర్లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు లక్ష్మీ దేవి చిత్రపటాన్ని బహుకరించారు.
ఇదీ చూడండి:ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్