కొవిడ్‌కు తన-మన భేదాలేమీ లేవు.. ఎవరు దొరికితే వారిని వేటాడేస్తోంది. అందుకే జాగ్రత్తలు పాటించకుంటే.. వైరస్ దాడికి బలవ్వక తప్పదని ప్రభుత్వాలు గొంతు చించుకుంటున్నాయి. అయితే, రాజస్థాన్‌లో ఓ మందు బాబు మాత్రం కరోనాను లెక్క చేయకుండా రోడ్డెక్కాడు. మాస్క్ ఏదని అడిగినందుకు పోలీసులపైనే తిరగబడి వీరంగం సృష్టించాడు.
జోధ్‌పుర్ దేవనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. గురువారం మధ్యాహ్నం తప్పతాగి రోడ్లపై తిరుగుతున్నాడు ముఖేశ్ కుమార్. మాస్క్ పెట్టుకోకుండా పోలీసుల కంటపడ్డాడు. దగ్గరికి పిలిచి మాస్క్ ఏదని అడిగితే అడ్డదిడ్డంగా సమాధానాలిచ్చాడు. దీంతో చలానా కట్టమన్నారు పోలీసులు. అంతే, నన్నే చలాన్ కట్టమంటావా అంటూ కోపంతో ఊగిపోయాడు ముఖేశ్. పోలీసులపైనే చేయిజేసుకున్నాడు.
'ఫ్లాయిడ్' దృశ్యం!
ముఖేశ్‌ను అదుపు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. అయితే ముఖేశ్‌ను ఆపేందుకు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌పై అక్కడి పోలీసులు ప్రవర్తించినట్లు మోకాలు మెడపై పెట్టి మందుబాబుని కదలనీకుండా చేశారు కానిస్టేబుళ్లు. చుట్టూ గుమిగూడిన జనం ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించారు.
అతికష్టం మీద ముఖేశ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో కానిస్టేబుల్ చెప్పిన వివరాల ప్రకారం ముఖేశ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2019లో ముఖేశ్ తన తండ్రి కన్ను పగలగొట్టినట్టు రికార్డుల్లో ఉంది.
ఇదీ చదవండి:కొత్తిమీర రైతుకు.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు