కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని రక్షించడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు బయోసూట్‌ను తయారుచేశారు. ఇది వ్యక్తిగత రక్షణ సాధనం (పీపీఈ)గా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. గిరాకీ దృష్ట్యా రోజుకు 15వేల సూట్లను తయారుచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పీపీఈలకు కొరత ఉండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
"డీఆర్‌డీవోలోని వివిధ ప్రయోగశాలల శాస్త్రవేత్తలు జౌళి, కోటింగ్, నానోటెక్నాలజీలో తమకున్న అనుభవాన్ని ఉపయోగించి బయోసూట్‌ను రూపొందించారు." అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
నిజానికి 'సీమ్ సీలింగ్ టేపుల' కొరతతో ఈ బయోసూట్ ఉత్పత్తికి ఇబ్బంది ఏర్పడింది. జలాంతర్గాముల అవసరాలకు ఉపయోగించే పదార్థం ఆధారంగా ఒక ప్రత్యేక సీలెంట్‌ను డీఆర్‌డీవో రూపొందించి, ఈ ఇబ్బందిని అధిగమించింది. 1.5 లక్షల లీటర్ల శానిటైజర్లను వివిధ భద్రతా సంస్థలకు సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్పారు. నానో పరిజ్ఞానంతో ఐదు పొరలు కలిగిన ఎన్99 మాస్కులను తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇదీ చూడండి : దిల్లీలో ఒక్కరోజే 141 కొత్త కేసులు- 2 మరణాలు