లాక్‌డౌన్ వేళ బ్యాంకులు మూసివేసిన నేపథ్యంలో ప్రజలకు నగదును అందించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టల్ సర్వీస్ ద్వారా డబ్బులను లబ్ధిదారుడి ఇంటికే చేరవేసేందుకు చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీఎం థామస్ ఇస్సాక్ ప్రజలకు నగదు చేరవేసే కార్యక్రమాన్ని ఆరంభించారు.
ఏప్రిల్ 8 నుంచి మీ ప్రాంతంలోని పోస్టల్ కార్యాలయానికి ఫోన్ చేసి బ్యాంక్ పేరు, అడ్రస్, నగదు ఎంతకావాలో చెప్పండి. పోస్టల్ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి అడిగిన డబ్బును అందజేస్తారు.
-థామస్ , కేరళ ఆర్థిక శాఖ మంత్రి
దీని కోసం మొత్తం 93 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆధార్‌తో అనుసంధానమైన ఖాతాదారులకు మాత్రమే నగదు అందించనున్నట్లు వెల్లడించారు.
ఎలా అందిస్తారు...
లబ్ధిదారుడి ఆధార్ నంబర్‌ను స్కాన్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి నగదు ఉపసంహరణ జరుగుతుందని మంత్రి థామస్ వెల్లడించారు. ఖాతాదారుడి వేలిముద్రలను బయోమెట్రిక్ ద్వారా స్కాన్ చేసి వెరిఫికేషన్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాన్ నగదు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా రోజుకు సగటున రూ. 10 వేల వరకు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేశారు.