బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్.. తృణమూల్ కాంగ్రెస్ మంత్రులను సుతిమెత్తగా హెచ్చరించారు. అధినేత్రి మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకునేందుకు తన వ్యాఖ్యలపై అతిగా స్పందించవద్దని సూచించారు. మంత్రులు తమ విభాగాల పనులు చూసుకోవాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తన వ్యాఖ్యలపై స్పందించాలని, లేదా నిర్దిష్ట మంత్రిని ఇందుకోసం నియమించాలని గవర్నర్ జగ్దీప్ స్పష్టం చేశారు.
"నా వ్యాఖ్యలపై జూనియర్ ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పందించారు. ఆమె తన మంత్రిత్వశాఖపై దృష్టిని కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్య మంత్రిత్వశాఖ నిజంగా ఎలా ఉందో మనకు తెలుసుకదా!"- జగ్దీప్ ధన్ఖర్, బంగాల్ గవర్నర్
ప్రభుత్వ స్పందన లేదు..
గవర్నర్ బుధవారం ముర్షిదాబాద్ జిల్లాలోని డోక్మల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం తనకు ఓ హెలికాప్టర్‌ను సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదించారు గవర్నర్. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలు ధరించి గవర్నర్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.
"నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నా చర్యలను నియంత్రించాలనుకుంటోంది. కానీ రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుల మేరకు నేను నడుచుకుంటానని స్పష్టం చేస్తున్నాను. ఇతరులు నన్ను నియంత్రించలేరు."- జగ్దీప్ ధన్ఖర్
చంద్రిమా రియాక్షన్
గవర్నర్ వ్యాఖ్యలపై టీఎమ్సీ నాయకురాలు చంద్రిమా భట్టాచార్య ప్రతిస్పందించారు.
"గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఏమి చేస్తున్నారో ఆలోచించాలి. గవర్నర్ కాక మునుపు అతను ఏమి చేసేవారో తెలీదు. రాష్ట్రప్రజలు గవర్నర్‌పై కోపంగా ఉన్నారు. కనుక అతనిపై నిరసన వ్యక్తం చేసి ఉండొచ్చు." - చంద్రిమా భట్టాచార్య, రాష్ట్ర మంత్రి
మాటల యుద్ధం..
బంగాల్లో గవర్నర్‌కు, ప్రభుత్వంలోని ముఖ్యనేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దుర్గాపూజోత్సవం సందర్భంగా తనను కార్యక్రమానికి పిలిచి అవమానించారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జాదవ్‌పుర్ యూనివర్సిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోను విద్యార్థుల దాడి నుంచి రక్షించడం; అప్పటి నుంచి గవర్నర్ కోసం చేపట్టిన భద్రత ఏర్పాట్లు తదితర అన్ని విషయాల్లోనూ మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఇదీ చూడండి: '2021 ఎన్నికల్లో అద్భుతం'.. రజనీ సంచలన వ్యాఖ్యలు