గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి 2005లో తీసుకువచ్చిన చట్టం ఓ మైలురాయి అని సుప్రీంకోర్టు పేర్కొంది. కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, ఒంటరి మహిళగా.. ఇలా నిరంతరం మహిళ ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటూనే ఉంటుందని వ్యాఖ్యానించింది.
హింసను వ్యతిరేకించకపోవడం, తగిన చట్టాలు లేకపోవడం, ఉన్న చట్టాల గురించి అవగాహన లేకపోవడం, సమాజ పోకడ.. ఇవన్నీ వారిని దుర్బలులుగా మారుస్తున్నాయంది సుప్రీం కోర్టు. వివాహిత మహిళకు గృహ హింస చట్టం కింద క్రిమినల్ కోర్టులు నివాస హక్కు కల్పించడం సముచితమేనని సమర్థించింది.
దిల్లీ హైకోర్టు కొట్టివేయడాన్ని..
దిల్లీకి చెందిన సతీష్ చంద్ర ఆహుజా (76) దాఖలు చేసిన కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తన ఇంటి నుంచి కోడలు బయటకు వెళ్లిపోవాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.
" సమాజం ఏమనుకుంటుందోననే సంకోచం వల్ల, తక్షణ ఉపశమనం దొరకడం లేదనే ఉద్దేశంతో ఎక్కువ మంది మహిళలు మౌనంగా వేధింపులను భరిస్తున్నారు. మహిళల హక్కుల్ని కాపాడడంపైనే ఏ సమాజం పురోగతి అయినా ఆధారపడి ఉంటుంది. స్త్రీ-పురుషులకు రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించడం.. మన దేశంలో మహిళల స్థాయిని మార్చడంలో కీలకమైన అడుగు. ".
--- సుప్రీం కోర్టు
ఉమ్మడి కుటుంబం అనే దానికి ఇదివరకటి తీర్పులో ఇచ్చిన నిర్వచనాన్ని తోసిపుచ్చింది. ఇది చాలా విస్తృతమైనదని, బాధిత మహిళకు నివాసం కల్పించడమే దీని ఉద్దేశమని వివరించింది.
ఇదీ చూడండి:చైనా స్మార్ట్‌ఫోన్ల కట్టడికి భారత్ వ్యూహం!