56 ఏళ్ల వయస్సు కలిగిన రోగి శరీరం నుంచి ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీని తొలగించారు దిల్లీ శ్రీగంగారామ్ ఆస్పత్రి వైద్యులు. దాదాపు రెండు గంటలు శ్రమించి 7.4 కిలోలు బరువు గల కిడ్నీని బయటకు తీశారు.
ఎందుకు ఇలా...?
దిల్లీకి చెందిన ఓ వ్యక్తి 'ఆటోసోమల్ పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి'తో బాధపడుతున్నారు. ఇదొక జన్యుపరమైన సమస్య. ఈ వ్యాధి కారణంగా కిడ్నీల్లో ద్రవం నిండి, వాస్తాయి. మొత్తం మూత్రపిండాల వ్యవస్థే దెబ్బతింటుంది.
ఇప్పటికే ఆ రోగి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఔషధాల ద్వారా నయం చేసేందుకు వైద్యులు ప్రయత్నించినా లాభం లేదు. చేసేది లేక ఎడమ కిడ్నీని తొలిగించాలని నిర్ణయించారు వైద్యులు.
"కిడ్నీ పరిమాణం భారీగా ఉందని పరీక్షల్లో తేలింది. కానీ ఇంత బరువు ఉంటుందని ఊహించలేదు. ఇద్దరు శిశువుల బరువుకన్నా ఈ కిడ్నీ బరువు ఎక్కువ.
సాధారణంగా మూత్ర పిండం బరువు 120 నుంచి 150 గ్రాములు ఉంటుంది. కానీ ఇది 32 x 21.8 సెంటీమీటర్ల పరిమాణంతో 7.4 కిలోల బరువు ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కిడ్నీ."
-డాక్టర్ సచిన్ కఠూరియా, యూరాలజీ కన్సెల్టెంట్.
2017లో పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగి నుంచి 4.25 కేజీల బరువు గల మూత్ర పిండి తొలగించారు. ఇదే ప్రపంచంలోని అతి పెద్ద కిడ్నీగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైంది. ఇప్పుడు దిల్లీ వాసి కిడ్నీ కేసు వివరాలను గిన్నిస్ రికార్డు కోసం పంపాలని వైద్యులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:అజిత్ తిరుగుబాటుతో నాకేం సంబంధం: పవార్