మద్యం బానిసలకు వైద్యుల సలహాపై లిక్కర్ సరఫరా చేయాలని ఆలోచన చేస్తున్న కేరళ ప్రభుత్వ తీరును భారత వైద్య మండలి (ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎమ్ఏ) తప్పు పట్టింది. ప్రభుత్వ నిర్ణయం 'శాస్త్రీయం'గా లేదని తేల్చిచెప్పింది.
"తాగుడు వ్యసనం నుంచి బయటపడుతున్న వారికి లేదా ఆసుపత్రిలో చేరిన వారికి వైద్యుల సలహాపై మందులు అందించాలి. వారికి మద్యం అందించడం 'శాస్త్రీయం'గా సరైన విషయం కాదు. వైద్యులకు కూడా లిక్కర్ ప్రిస్క్రైబ్ చేసే అధికారం లేదు."
- డాక్టర్ అబ్రహాం వర్గీస్, ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు
వైద్యులు ఎవరైనా మందుబాబులను లిక్కర్ తాగాలని సూచిస్తే... వారి లైసెన్సులు కూడా రద్దు చేసే అవకాశముందని ఐఎమ్ఏ హెచ్చరించింది.
చుక్క కోసం ప్రాణం తీసుకున్నారు..
కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేరళలో మద్యం దుకాణాలు మూసివేస్తూ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా.. మత్తుకు బానిసలైన కొంత మంది నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
మద్యం బానిసలు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వామపక్ష ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం.. మద్యం బానిసలకు బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లిక్కర్ సరఫరా చేయాలని ఆలోచన చేస్తోంది.
ఇదీ చూడండి: దేశంలో 1000 దాటిన కరోనా కేసులు.. 27 మంది మృతి