వైద్యం కోసం వచ్చే కరోనా బాధితులకు పడకలను కల్పించి, సకాలంలో వారికి చికిత్సలను అందించాలని ప్రైవేటు ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వాణిజ్య మండలి ఫిక్కీ, దిల్లీ ఎయిమ్స్‌తో కలిసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వర్చువల్ సదస్సును నిర్వహించింది. కొవిడ్ మరణాలను ఒక శాతం కన్నా తక్కువకు తీసుకురావాలన్న ఉద్దేశంతో సదస్సును నిర్వహించారు.
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు.
"ఆరోగ్య వ్యవస్థలను అందరికీ అందుబాటులో ఉంచాలన్నది సమష్టి లక్ష్యం కావాలి. కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవటంలో ఎలాంటి అవరోధాలను కల్పించరాదని, సరైన చికిత్సలు అందించటంలో వివక్ష చూపరాదు."
- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.
ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై పోరులో తమ అనుభవాలను, ఎదురైన సవాళ్లను ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు వివరించారు. సదస్సుకు 150 మందికిపైగా ఆసుపత్రుల ప్రతినిధులు, సీనియర్ వైద్యులు హాజరయ్యారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఫిక్కీ అధ్యక్షురాలు, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ జేఎండీ డా.సంగీతారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టీకా భద్రతా పర్యవేక్షణను మరింత పెంచండి: డీసీజీఐ