అభివృద్ధి చెందిన దేశాల తరహాలో భారత్‌లో కరోనా మహమ్మారితో దుర్భర పరిస్థితులు వస్తాయని ఊహించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్. కరోనాను కట్టడి చేయటంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని స్పష్టం చేశారు.
కొవిడ్-19 పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు కేంద్ర మంత్రి.
" చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న దుర్భర పరిస్థితులు భారత్‌లో వస్తాయని మేము అనుకోవడం లేదు. కానీ.. ఇప్పటికే అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం మొత్తాన్ని సిద్ధం చేశాం. మన దేశంలో మరణాల రేటు 3.3 శాతంలోనే కొనసాగుతోంది. కోలుకుంటున్న వారి సంఖ్య 29.9 శాతానికి పెరిగింది. మెరుగైన స్థితిలో ఉన్నామనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కేసుల రెట్టింపు రేటు గత మూడు రోజులగా చూసుకుంటే 11 రోజులుగా ఉంది. 7 రోజుల కేసులను చూస్తే రెట్టింపు రేటు 9.9 రోజులుగా ఉంది."
– డా. హర్షవర్ధన్, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి.
3 లక్షల పడకలు
కేవలం కొవిడ్-19 రోగుల చికిత్స కోసమే 843 ఆస్పత్రులను కేటాయించామని.. అందులో 1,65,991 పడకలు సిద్ధం చేసినట్లు తెలిపారు హర్షవర్ధన్. దేశవ్యాప్తంగా 1,991 ఆరోగ్య కేంద్రాల్లో ఐసొలేషన్, ఐసీయూతో కలిపి మొత్తం 1,35,643 బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
7,645 క్వారంటైన్ కేంద్రాలు..
దేశవ్యాప్తంగా 7,645 క్వారంటైన్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి. కరోనా పరిస్థితులపై ప్రతి రోజు రాష్ట్రాలను సమన్వయం చేస్తూ పని చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 69 లక్షల ఎన్-95 మాస్కులు, 32.76 లక్షల పీపీఈ కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 453 ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం మేరకు… కేవలం 0.38 శాతం రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారని, 1.88 శాతం మందికి ఆక్సిజన్ సాయం అవసరమవుతోందని, 2.21 శాతం మంది ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు.