డీఎంకే అధ్యక్షుడు, తన తమ్ముడు ఎంకే స్టాలిన్ ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరని ఎంకే ఆళగిరి అన్నారు. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆయన.. మధురైలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీ స్థాపించే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని తెలిపారు. నిర్ణయం ఎలా ఉన్నా అందరూ స్వాగతించాలని కోరారు.
" డీఎంకే కోశాధికారిగా ఉండాలని స్టాలిన్‌కు సూచించా. కానీ నేను సౌత్‌జోన్ సెక్రెటరీ అయినందుకు స్టాలిన్ అసూయ చెందారు. కరుణానిధి తర్వాత పార్టీ మొత్తం బాధ్యతలు చూసుకోవాలని స్టాలిన్‌కు చెప్పా. కానీ నాకు ఇలా ద్రోహం చేస్తారని అర్థం చేసుకోలేకపోయా. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం చేయాలని కరుణానిధి కోరారు. అందుకు నేను అంగీకరించా.
కరుణానిధి లాంటి నేత మరొకరు ఉండరు. ప్రస్తుత డీఎంకే ఆయనను మర్చిపోయింది. స్టాలినే భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రి అని పోస్టర్లు కన్పిస్తాయి. కానీ అది ఎప్పటికీ జరగదు. నా అనుచరులు స్టాలిన్‌ను ఎప్పటికీ సీఎం కానివ్వరు. కొత్త పార్టీ పెట్టమని ఎంతోమంది నాకు సూచనలు ఇచ్చారు. దీనిపై త్వరలోనే స్పష్టతనిస్తా."
-ఎంకే అళగిరి.
దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి. 2014లో ఆయనను పార్టీ బహిష్కరించింది. 'కలైంజ్ఞర్ డీఎంకే' పార్టీ స్థాపించాలని ఆయన అనుచరులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. రజనీ పార్టీలోకి ఆయన వెళ్తారని కూడా ప్రచారం జరిగింది.