మనీ లాండరింగ్ కేసులో మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా కర్ణాటకలో నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రమంతా శివకుమార్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేప్టటారు. రోడ్లకు అడ్డంగా టైర్లను తగులబెట్టారు. ప్రభుత్వ బస్సులకు నిప్పంటించారు. కేఎస్ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ఫలితంగా రాష్ట్రమంతా నిరసనల హోరుతో అట్టుడుకుతోంది.
రామనగర బంద్...
ప్రభుత్వం డీకే విషయంలో ఈడీని తప్పుగా ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేడు రామనగర జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఆయన సొంత నియోజకవర్గం కనకాపురలో ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.
రామనగర నుంచి బెంగళూరు- మైసూరు వెళ్లే రోడ్డు మార్గాన్ని ఆందోళనకారులు పూర్తిగా దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను వేరే మార్గాల వైపు మళ్లించారు.
మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను దిల్లీలో నాలుగు సార్లు ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. నేడు ఆయనను కోర్టులో హాజరుపర్చనుంది.
ఇదీ చూడండి:డీకే అరెస్టుకు నిరసనగా కర్ణాటకలో ఆందోళనలు