పార్టీలో అంతర్గత కలహాలకు నాయకత్వ అంశమే కారణమన్న విశ్లేషణల నడుమ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆగస్టు 24న సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ స్పష్టం చేశారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకత్వ అంశంతోపాటు దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించి ఆగస్టు 10 నాటికి ఏడాది గడుస్తోంది. అయితే పార్టీలో నాయకత్వ సమస్యపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
రాహుల్‌పైనే దృష్టి..
పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ మళ్లీ స్వీకరించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం కోరుకుంటోంది. చాలా మంది పార్టీ నేతలు రాహుల్ బాధ్యతలు చేపట్టాలని బహిరంగంగానే ప్రస్తావించారు. కానీ, రాహుల్‌కు ఇందుకు సిద్ధంగా లేరని శశిథరూర్ వంటి నేతలు చెబుతున్నారు.
అయితే సోనియాగాంధీకు విధేయులుగా ఉన్న సీనియర్ సభ్యులు మరో ఏడాది అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
తాత్కాలిక సభ్యులూ..
ఈ భేటీలో సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యులూ పాల్గొంటారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అధినేతలు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు సీడబ్ల్యూసీలో తాత్కాలిక సభ్యులుగా ఉంటారు. వీరిలో అత్యధికులు రాహుల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమితులైన వారే.
వ్యూహమిదే..
శాశ్వత సభ్యులతోపాటు తాత్కాలిక సభ్యులను భేటీకి ఆహ్వానించటం అంటే రాహుల్‌ను బలపరిచే వారి సంఖ్యను పెంచి.. పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దిల్లీ వచ్చిన సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఇదీ చూడండి: 'రఫేల్ విషయంలో దేశ ఖజానా దోపిడీకి గురైంది'