దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 83 మందికి సోకింది. ప్రపంచవ్యాప్తంగా 5వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో శుభ్రత పాటిస్తే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చేతులతో పాటు మొబైల్‌ను క్రమం తప్పకుండా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.
"కళ్లు, నోరు, ముక్కును తాకడం మానుకోండి. ఫోన్ కవర్ లేదా బ్లూటూత్ పరికరాన్ని ఉపయోగించండి. మీ ఫోన్‌ను వీలైనంత తక్కువగా వాడండి. మొబైల్‌ను రోజుకు కనీసం రెండుసార్లు శుభ్రం చేసుకుంటే మంచింది. వీలైతే సగటున ప్రతి 90 నిమిషాలకు ఒకసారి శానిటైజర్‌తో తుడవాలి."
- రవిశేఖర్, వైద్యుడు, ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రి
2018లో గాడ్జెట్ బీమా సంస్థ 'ఇన్సూరెన్స్2గో' ఓ నివేదిక అందించింది. దీని ప్రకారం స్మార్ట్ ఫోన్ తెరలపై టాయిలెట్ సీటు కన్నా 3 రెట్లు అధికంగా సూక్ష్మజీవులు ఉంటాయని తెలిపింది. 20 మందిలో ఒకరు తమ ఫోన్లను ఆరు నెలలకు ఒకసారి శుభ్రంచేస్తున్నారని నివేదించింది.
"ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు, ఇంటికి తిరిగి వచ్చాక స్మార్ట్ ఫోన్‌ను శుభ్రం చేసుకోవటం ఉత్తమం. ప్రాథమిక శుభ్రత పాటించండి. ఈ రెగ్యులర్ గాడ్జెట్లను శానిటైజ్ చేయండి. శ్వాసకోశ అనారోగ్యం లేదా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతుంటే ఇతరుల ఫోన్‌లను ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించండి."
-జ్యోతి ముత్తా, మైక్రోబయాలజీ సీనియర్ కన్సల్టెంట్
స్మార్ట్‌ఫోన్‌లోని హోమ్ బటన్‌పై మిలియన్ల కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయని బ్రిటన్ సర్రీ విశ్వవిద్యాలయం మరొక అధ్యయనంలో తెలిపింది.
"కరోనా వైరస్, ఇతర సూక్ష్మక్రిములు గాజు, లోహం, ప్లాస్టిక్ వంటి ఉపరితలాలపై జీవించగలవు. మన చేతులు అన్ని సమయాల్లో శుభ్రంగా ఉండేలా చూసుకోవడం అవసరం. దగ్గినప్పుడు ఏదైనా అడ్డుగా పెట్టుకోవటం తప్పనిసరి."
- సూరంజిత్ ఛటర్జీ, ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి
కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ మేరకు కొన్ని సూచనలను జారీ చేసింది. కరోనా వైరస్ అన్ని వయసులవారికి సోకుతుందని స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్ఓ. వృద్ధులు, ఆరోగ్యంగా బలహీనంగా ఉన్నవారు తొందరగా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది. బాగా వండిన ఆహారాన్ని తినడం, బహిరంగంగా ఉమ్మివేయకూడదని, ఇతరులతో సన్నిహితంగా ఉండకూదని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్దేశించింది.
ఇదీ చూడండి: 'మోదీజీ.. మాస్క్‌ల ఎగుమతులకు అనుమతినివ్వండి'