కాంగ్రెస్ దిల్లీ విభాగం అధ్యక్షురాలిగా తన ఆఖరి నిర్ణయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి మద్దతుగా తీసుకున్నారు షీలా దీక్షిత్. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు వెళ్లకుండా ప్రియాంకను అదుపులోకి తీసుకున్నఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భాజపా కేంద్ర కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ నిరసనకు షీల నేతృత్వం వహించలేదు. కార్యనిర్వాహక అధ్యక్షుడు హరూన్ యూసఫ్ ఈ నిరసన చేపట్టారు. యూపీ-ప్రియాంక వివాదం సమసిపోకుంటే శనివారం మరోసారి నిరసన చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
'యూపీ ప్రభుత్వానికి, ప్రియాంక గాంధీకి మధ్య వివాదం ఈ రోజు ముగియకపోతే... భాజపా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాల్సి ఉంటుంద'ని శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ దిల్లీ విభాగం అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ తన చివరి సూచన ఇచ్చారని కాంగ్రెస్ నేత కిరణ్ వాలియా తెలిపారు.
సోన్‌భద్ర వివాదం మరో మలుపు తీసుకోకుంటే తాము నిరసన చేపట్టేవారమని ఆయన స్పష్టం చేశారు.
సోన్‌భద్ర బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి శుక్రవారం బయలుదేరిన ప్రియాంకను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డగించి చునార్ అతిథి గృహానికి తరలించారు. రాత్రంతా ప్రియాంక అతిథి గృహంలోనే గడిపారు. వెనుదిరగమని స్థానిక అధికారులు అభ్యర్థించినప్పటికీ ఆమె అక్కడి నుంచి కదలలేదు. బాధితులను కలిసేంతవరకు రాష్ట్రాన్ని విడిచి వెళ్లనని తేల్చిచెప్పారు. శనివారం అక్కడే ధర్నాకు దిగారు. అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఎట్టకేలకు చునార్ అతిథి గృహంలోనే సోన్‌భద్ర బాధితుల కుటుంబసభ్యులను ప్రియాంక కలిశారు. అనంతరం వారణాసికి తిరుగు పయనమయ్యారు.
ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి