పురాతన ఆలయాలకు ప్రతీతిగా నిలిచిన ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని ఓ ఆలయంలో ప్రజలు తమ ఆరాధ్యదైవాన్ని చాలా భిన్నంగా పూజిస్తారు. ఇంతకీ ఆ ఆలయ ప్రత్యేకతలేంటి? అక్కడి ప్రజలు చెల్లించే మొక్కులు ఎందుకు భిన్నంగా ఉన్నాయో తెలుసుకుందామా?
'తాళాల'తోనే మొక్కులు..
వారణాసిలోని దశశ్వమేద్ ఘాట్ సమీపంలో నెలకొన్న 'బందీ దేవి' ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అక్కడి అమ్మవారికి మొక్కులు చెల్లించేవారంతా ఆలయ ద్వారాలకు తాళాలు వేస్తారు. తాళం చెవిని వారే తీసుకెళ్తారు. ఇలా చేస్తే కష్టాల నుంచి బయటపడతారని, జీవితం ఆనందంగా సాగుతుందని వారి నమ్మకం.
ఒకవేళ వారి కోరికలు తీరినట్లయితే... ఆలయ ద్వారానికి వేసిన తాళాన్ని తీసి దాన్ని గంగా నదిలో విసిరేస్తారు భక్తులు.
'అన్ని సమస్యలకు పరిష్కారం'
బందీ దేవి అమ్మవారికి ఈ విధంగా మొక్కులు చెల్లిస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. సహజంగా మంగళ, శుక్రవారాల్లో.. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నవరాత్రుల ఉత్సవాల్లో తండోపతండాలుగా దేవీ దర్శనానికి విచ్చేస్తుంటారు భక్తులు.
అందుకే 'దేవి'ని కొలుస్తారు..
త్రేతా యుగం నుంచే బందీ దేవి తన భక్తులను కాపాడుతోందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. 'పాతాళ దేవి'గా రామ లక్ష్మణుడిని ఓ రాక్షసుడి చెరనుంచి రక్షించింది ఈ దేవియే అని భక్తుల నమ్మకం.
" సహజంగా 41 రోజులపాటు అమ్మవారిని పూజిస్తారు. వారి కోరికలు తీరిన వెంటనే అమ్మవారికి ఓ తాళాన్ని మొక్కుగా చెల్లిస్తారు. దేవి దర్శనానికి దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. చాలా మంది సినీ తారలు కూడా ఇక్కడ పూజలు నిర్వహించారు".
- సుధాకర్ దుబే, ఆలయ పూజారి
ఇదీ చదవండి:'ప్రపంచీకరణతో పాటు స్వయం సమృద్ధీ ముఖ్యమే'