ఈశాన్య దిల్లీలో అలర్లకు కారణమైన విద్వేష ప్రసంగాలు చేసిన రాజకీయ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్పై మార్చి 4న విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దిల్లీ అల్లర్ల బాధితుల తరపున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది కోలిన్ గాన్‌స్లేవ్స్, పిటిషన్‌ను సత్వరమే విచారణ జరపాలని కోరారు. అల్లర్లలో ఇంకా ప్రజలు చనిపోతుంటే దిల్లీ హైకోర్టు విచారణ వాయిదా వేసిందని ఆయన కోర్టుకు వివరించారు.
శాంతిభద్రతల అంశం కోర్టు పరిధిలోని విషయం కాదుకదా అని సీజేఐ జస్టిస్ బోబ్డే గుర్తుచేశారు. దిల్లీ అల్లర్లకు సంబంధించిన అంశాలను పత్రికల్లో చూసినట్లు చెప్పారు జస్టిస్ బోబ్డే. తాము శాంతినే కోరుకుంటున్నామన్నారు. కోర్టుకు కూడా పరిధులు ఉంటాయన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత.. కార్యనిర్వాహక వ్యవస్థదేనని ఆయన గుర్తుచేశారు.
ప్రజలు చనిపోతున్నప్పుడు దిల్లీ హైకోర్టు నాలుగు వారాలకు విచారణ వాయిదా వేయడం సరికాదని న్యాయవాది కోలిన్ గాన్‌స్లేవ్స్ వాదించారు. మంగళవారం విచారణ జరిపాలని ఆయన కోరగా, బుధవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బాధితులకు సహాయక చర్యలపై నివేదిక..
దిల్లీ అల్లర్ల బాధితులకు పునరావాసాల ఏర్పాటు, వైద్య సదుపాయాలకు సంబంధించి చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని పోలీసులను అదేశించింది దిల్లీ హైకోర్టు. ఫిబ్రవరి 26న ఇచ్చిన సూచనల మేరకు ఈ నివేదిక కోరింది.
దిల్లీ అల్లర్ల బాధితుల కోసం అంబులెన్సులకు భద్రత, పునరావాసాల సదుపాయాలను అత్యవసరంగా కల్పించాలని దాఖలైన పిటిషన్పై దిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగానే పై ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 30కి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇదీ చూడండి:నిర్భయ దోషి పవన్ క్షమాభిక్ష పిటిషన్.. 'ఉరి'పై ఉత్కంఠ