పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో జరుగుతోన్న అల్లర్లపై దిల్లీ హైకోర్టు మంగళవారం అర్ధరాత్రి అత్యవసర విచారణ చేపట్టింది. ఘర్షణల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించింది.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎస్ మురళీధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన నివాసంలో విచారణ జరిపింది.
నివేదికలు అందించాలి..
గాయపడిన వారిని తరలించేందుకు అవసరమైన భద్రత కల్పించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. క్షతగాత్రులు, వారికి అందించే వైద్యానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. దిల్లీలోని గురు తేగ్ బహదుర్, లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రుల అధినేతలకు ఈ ఆదేశాలు చేరవేయాలని తెలిపింది. తదుపరి విచారణను ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.