దిల్లీలో సీఏఏ వ్యతిరేక ఘర్షణలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 160మందికి పైగా గాయపడ్డారు.
రాళ్ల దాడులు....
మౌజ్‌పుర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కబీర్‌నగర్‌లో స్థానికులను బెదిరిస్తూ దుకాణాలపై రాళ్లు విసిరాయి అల్లరి మూకలు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. బాబర్‌పుర్, జాఫ్రాబాద్, ఖజూరీ ఖాస్ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని సమచారం. ముందు జాగ్రత్త చర్యగా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
అల్లర్ల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఖజూరీ ఖాస్ ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాతు నిర్వహించాయి. ఖజూరీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు అధికారులు.
అమిత్‌షా సమీక్ష
పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు షా.
'సంయమనం పాటించండి'
దిల్లీలో జరుగుతున్ హింసాత్మక ఘర్షణలపై యావత్‌దేశం ఆందోళన చెందుతుందన్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జాతిపిత మహాత్ముడు చూపిన అహింసమార్గంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు కేజ్రీవాల్. మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు.
హెడ్ కానిస్టేబుల్‌కు తుది వీడ్కోలు...
సోమవారం మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నేడు పూర్తయ్యాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.
ఇదీ చూడండి: భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలివే..