దిల్లీ సహా దేశవ్యాప్తంగా కరోనా భయాందోళనలకు కారణమైన హజ్రత్ నిజాముద్దీన్ మార్కాజ్ భవనంలో ఉన్న వారిలో 860 మందిని ఆసుపత్రులకు తరలించారు అధికారులు. భవనంలో ఉన్న మరో 300 మందిని కూడా ఆసుపత్రులకు చేరుస్తున్నారు. మార్కాజ్ భవనం ప్రాంతాన్ని డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 1500మంది స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో వారిని గుర్తించే దిశగా కృషిచేస్తున్నారు.
ఇదీ జరిగిందీ..
దిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతం మార్కాజ్ భవనంలో జనతా కర్ఫ్యూనకు ముందు కొద్ది రోజుల పాటు మత ప్రార్థనలు జరిగాయి. 23వ తేదీన 1500మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరో 1000మంది మార్కాజ్లో ఉండిపోయారు. అయితే ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో 10మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పలువురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు మార్కాజ్ భవనంలో ఉన్న 1000 మందిని ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ చేపట్టారు. 860మందిని ఇప్పటికే వైరస్ బాధితుల కోసం ప్రత్యేకించిన ఆసుపత్రులకు చేర్చారు. భవనంలో మిగిలిన 300మందిని ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు అధికారులు.
జవహార్ స్టేడియం.. నిర్బంధ కేంద్రం
పెద్దసంఖ్యలో గుమిగూడటం.. వారిలో వైరస్ బాధితులు ఉన్న కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. జవహార్లాల్ నెహ్రూ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు యోచిస్తోంది దిల్లీ సర్కారు. లాక్ డౌన్ అనంతరం కూడా పెద్దసంఖ్యలో గుమిగూడటంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించిన నేపథ్యంలో మతపెద్దలపై కేసులు నమోదు చేశారు.
మతపెద్దల వివరణ
అయితే ఘటనపై వివరణ ఇచ్చారు మార్కాజ్ భవనం మతపెద్దలు. మార్కాజ్ను మూసేస్తున్నట్లు అధికారులకు సమాధానమిచ్చామని చెప్పారు. కర్ఫ్యూ విధించాక వాహనాలు అందుబాటులో లేని కారణంగా స్వస్థలాలకు వెళ్లలేకపోయారని వెల్లడించారు.
"మార్కాజ్ భవనాన్ని మూసివేయాలని హజ్రత్ నిజాముద్దీన్ పోలీసులు మార్చి 24న మాకు ఆదేశాలు జారీ చేశారు. మార్కాజ్ను మూసివేస్తున్నామని ఆరోజే సమాధానామిచ్చాం. 23వ తేదిన 1500 మంది వారి ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారని చెప్పాం. మిగతావారిని పంపేందుకు వాహన పాసులను జారీ చేయాలని సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశాం. వాహన నెంబర్లు, డ్రైవర్ల వివరాలు సమర్పించాం."
- మార్కాజ్ భవనం వివరణ
ఇదీ చూడండి: దిల్లీలో కరోనా కలకలం.. ఐసోలేషన్లో వందలాది మంది!