దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రమవుతోంది. సరైన చికిత్స లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న సదుపాయాలు వినియోగించి కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు. చాలా మంది కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా థెరఫీ ఫలితాలు ఇస్తోంది. ఇందుకోసం కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. ఇలాంటి సమయంలో దిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 9 సార్లు ప్లాస్మాదానం చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రాష్ట్రంలోనే తొలివ్యక్తి..
జహంగీర్పురీ ప్రాంతానికి చెందిన తబ్రీజ్ ఖాన్కు మార్చి 18 కరోనా నిర్ధరణ అయ్యింది. ఏప్రిల్ 5న కొవిడ్ నుంచి కోలుకున్నారు. తన సహాయంతో మరింత మంది కరోనా నుంచి కోలుకునే వీలుందని తెలిసి అప్పుడే తొలిసారి ప్లాస్మాదానం చేశారు. రాష్ట్రంలో ప్లాస్మాదానం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం గమనార్హం.
ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు 9 సార్లు ప్లాస్మా దానం చేయడం గర్వంగా భావిస్తున్నట్లు 'ఈటీవీ భారత్'తో అన్నారు తబ్రీజ్ ఖాన్.

"మంచి పని కోసం నేను ఇలా చేస్తుండటం నాకు సంతోషంగా, సంతృప్తిగా ఉంది. దేశంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడటంలో నా భాగస్వామ్యం కూడా ఉన్నందుకు నాకు గర్వంగా అనిపిస్తుంది."
- తబ్రీజ్ ఖాన్
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని తబ్రీజ్ పిలుపునిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఎంతో అవసరమని ఆయన అంటున్నారు.
ఇదీ చూడండి:'రష్యా 'స్పుత్నిక్-వీ' ప్రతిపాదనకు అధిక ప్రాధాన్యం '