దేశ రాజధాని దిల్లీలో శీతాకాలం ప్రారంభంలోనే వాయు కాలుష్యం సమస్య తీవ్రరూపు దాల్చింది. ఈ పరిస్థితితో ఆప్ సర్కారు అప్రమత్తమైంది. కాలుష్య కోరల నుంచి పాఠశాల విద్యార్థులను రక్షించేందుకు 50 లక్షల మాస్కులు అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారభించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఎన్-95 రకానికి చెందిన 50 లక్షల కాలుష్య రక్షిత మాస్కులు అందజేస్తారని సమాచారం. వారంపాటు ఈ మాస్కులను పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
'అదే కారణం'
దిల్లీలో కాలుష్యం పెరిగేందుకు కారణం పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్లో పంట వ్యర్థాలను కాల్చడమేనని చెప్పారు కేజ్రీవాల్. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడాన్ని నియంత్రించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
కాల్చివేతపై నిరసన..
వ్యవసాయ వ్యర్థాలను కాల్చడాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని పంజాబ్ భవన్, హరియాణా భవన్ ముందు గురువారం నిరసన చేపడతామని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయా రాష్ట్రాల్లోని భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు... దిల్లీ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. కాలుష్యానికి వ్యతిరేక పోరాటంలో ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: లెక్కల చిక్కులు: మరో మిత్రపక్షంతో భాజపాకు ఇబ్బందులు!