ఆ అమ్మాయి వయసు 18 ఏళ్లే. డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కింది. భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్‌గా ఒకరోజు పనిచేసేందుకు ఆహ్వానం అందింది. ఒక్కరోజు సమయంలోనే హై కమిషనర్‌గా తన సామర్థ్యాన్ని చూపి ప్రశంసలు అందుకున్న ఆ అమ్మాయి దిల్లీకి చెందిన చైతన్య వెంకటేశ్వరన్.
అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడంలో భాగంగా.. బ్రిటన్ హై కమిషనర్ కార్యాలయం ఆమెకు 'వన్డే హై కమిషనర్'గా అవకాశమిచ్చింది. దీని కోసం ఆ కార్యాలయం 'కొవిడ్ సంక్షోభ కాలంలో స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించడానికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి ఉన్న అవకాశాలు' అనే అంశంపై ఆన్‌లైన్‌లో మహిళలకు ఓ పోటీని నిర్వహించింది. అందులో 215 మంది పాల్గొనగా చైతన్య పంచుకున్న అభిప్రాయాలు అధికారులను మెప్పించగా ఈ అవకాశం తలుపు తట్టింది.
హై కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన చైతన్య.. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లకు చెందిన మహిళా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై లింగ వివక్ష, పోలీసింగ్ విధానాలపై చర్చించింది. ఆనంద్ బజార్ పత్రిక ఎడిటర్‌తో భేటీలో పాల్గొని మీడియాలో మహిళల పాత్రను తెలుసుకుంది. బ్రిటన్ హై కమిషనర్ ఆధ్వర్యంలో 166 మంది భారత మహిళా ఉన్నత విద్యావంతుల విజయగాథలను వెలికితీసే 'స్టెమ్' అధ్యయనాన్ని ప్రారంభించింది.
హై కమిషనర్‌గా పనిచేయడం ఓ గొప్ప అనుభూతి అని చైతన్య పేర్కొంది. కరోనా నిబంధనల కారణంగా ఆమె వర్చువల్‌గానే హై కమిషనర్‌గా విధుల్లో పాల్గొంది.