ఆమ్ ఆద్మీ, భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన దిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడింది. మొత్తం 70 స్థానాలున్న హస్తిన శాసనసభకు ఈ శనివారం పోలింగ్ జరగనుంది. అన్ని స్థానాలకు ఒకే విడతలో జరగనున్న ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల్లో మొత్తం కోటి 46 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో దాదాపు 80 లక్షల మంది పురుషులు. 66 లక్షల మంది మహిళలు ఉన్నారు. దిల్లీ వ్యాప్తంగా 13 వేల 750 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పటిష్ఠ భద్రత
భద్రత నిమిత్తం 90 వేల మంది సిబ్బందిని మోహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. షహీన్‌బాగ్‌లోని మొత్తం 40 పోలింగ్ స్టేషన్లలో.. ఐదు కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. షహీన్‌బాగ్‌లో పరిస్థితులను పరిశీలించామని.. అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణబీర్‌సింగ్ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతోందని.. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 47 కంపెనీల బలగాలను మోహరించామని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 190 కంపెనీల బలగాలను దిల్లీలో మోహరించామని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారంలో హద్దు దాటిన నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. పలువురు నేతల ప్రచారంపై ఆంక్షలు విధించింది.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: రెండు భావజాలాల మధ్యే యుద్ధం!