దిల్లీలో హింసాత్మకంగా మారిన పౌర చట్ట వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేల పరిహారం అందజేయనున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.
'బయటి వ్యక్తుల పనే'
సీఏఏ వ్యతిరేక ఘర్షణలపై స్పందించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈశాన్య దిల్లీలో ఘర్షణలు చెలరేగిన ప్రాంతాలను సందర్శించిన ఆయన ఘర్షణల వెనక బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు. 27మంది ప్రాణాలు కోల్పోయిన ఈ హింసలో అసాంఘిక శక్తులు జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. స్థానికులతో సంభాషించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు కేజ్రీవాల్. సంయమనం పాటించాలని హితవు పలికారు. కేజ్రీవాల్ వెంట ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్నారు.
అంతకుముందు దిల్లీ అసెంబ్లీ వేదికగా ఘర్షణల్లో మృతి చెందిన కానిస్టేబుల్ రతన్లాల్కు రూ. కోటి పరిహారాన్ని ప్రకటించారు కేజ్రీవాల్.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: 106 మంది అరెస్టు-18 ఎఫ్ఐఆర్లు నమోదు