ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్‌కు ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ మధ్య మంగళవారం తీవ్ర మాటల యుద్ధం జరిగింది. పార్టీలో కొనసాగాలా.. వద్దా.. అని ప్రశాంత్ కిశోర్ తేల్చుకోవాలని నితీశ్ వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిశోర్ 2018 సెప్టెంబర్‌లో జేడీయూలో చేరారు. నితీశ్ కుమార్ ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే జేడీయూ మిత్రపక్షమైన భాజపాపై ప్రశాంత్ కిశోర్ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో ఆ పార్టీని సమర్థించాలన్న జేడీయూ నిర్ణయాన్ని కిశోర్ తప్పుబడుతున్నారు.
ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కన్నా ఎక్కువ సీట్లలో తమ పార్టీ పోటీ చేయాలన్నారు. దీనికితోడు దిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు. అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆప్‌తో తలపడుతున్నాయి.
నితీశ్ స్పందన
ఈ నేపథ్యంలో మంగళవారం భాజపా అగ్రనేత అమిత్‌షాపై ప్రశాంత్ కిశోర్ గుప్పిస్తున్న విమర్శలు, వాటివల్ల భాజపాతో జేడీయూ మైత్రిపై పడే ప్రభావం గురించి నితీశ్‌ను విలేకరులు ప్రశ్నించారు.
"వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా ఆయన ఆప్‌తో పనిచేస్తున్నారు. ఆ పార్టీతో ఆయన పనిచేస్తున్నారని పత్రికల్లోనే చూశా. అమిత్ షా సిఫార్సు మేరకే ఆయనను పార్టీలో చేర్చుకున్నా. ప్రశాంత్.. పార్టీలో కొనసాగితే సంతోషిస్తా. అందుకు భిన్నమైన ఆలోచన చేసినా నాకు సమ్మతమే. ఒకవేళ కొనసాగాలని నిర్ణయించకుంటే పార్టీ యంత్రాంగాన్ని ఆయన గౌరవించాల్సిందే."
-నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
'నితీశ్ వ్యాఖ్యలు అబద్ధం'
దీనిపై ప్రశాంత్ కిశోర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తన చేరికపై నితీశ్ వ్యాఖ్యలు అబద్ధమన్నారు.
"మీ రంగులను నాకు పులిమేందుకు యత్నిస్తున్నారు. ఒకవేళ మీరు చెబుతున్నదే నిజమనుకుంటే.. అమిత్ షా సిఫార్సు చేసిన వ్యక్తి వాదనను పెడచెవిన పెట్టే ధైర్యం మీకు ఉంటుందని ఎవరు నమ్ముతారు."
-ప్రశాంత్ కిశోర్, జేడీయూ పార్టీ నేత