జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం(జేఎంఐ) విద్యార్థులపై జరిగిన దాడిపై సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. జామియా విద్యార్థి సమన్వయ సంఘం నేతలు తమపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలను బహిర్గతం చేసి.. ఈ దురాగతానికి పాల్పడింది పోలీసులేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్న దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిబ్రవరి 25లోగా నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు అఖిల భారత విద్యార్థి సంఘం కార్యదర్శి చందన్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది కోర్టు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి బాధ్యులను భయపెట్టే అవకాశం ఉందని.. న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని కోర్టుకు విన్నవించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కుమార్ ఫోన్
ఈ కేసులో వామపక్ష వర్గానికి చెందిన కుమార్.. జామియా ఘటనలో ఓ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో హింసాకాండలో కుమార్ పాత్రను నిర్ధరించడానికి అతడి చరవాణిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని, నివేదిక వచ్చిన తర్వాత తిరిగి ఇస్తామని పోలీసులు తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ 15న విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇందులో నాలుగు బస్సులు, 100 ప్రైవేటు వాహనాలు, 10 పోలీసు బైకులు ధ్వంసం అయ్యాయి. అయితే అదే సమయంలో పోలీసులు జేఎంఐ లోపలకు ప్రవేశించారు. విద్యార్థులపై పలువురు ఆగంతుకులు దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి జేఎంఐ విద్యార్థుల సమన్వయ సంఘం ఆదివారం ఓ 48 సెకెన్ల వీడియో దృశ్యాన్ని విడుదల చేసింది. దాడి చేసింది పోలీసులేనని ఆరోపించింది.
ఇదీ చూడండి: 'జామియా దృశ్యాలను మానవ హక్కుల సంఘానికి పంపిస్తాం'