కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు సంబంధించిన ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు విచారణను నిరవధిక వాయిదా వేసింది దిల్లీ కోర్టు. సీబీఐ, ఈడీలు పదేపదే విచారణ వాయిదా వేయాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ, ఈడీల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది నితేశ్ రాణా వాదనలు వినిపించారు. విదేశాల నుంచి సమాచారం ( లెటర్స్ రోగటరి ) రావాల్సి ఉన్నందున ఈ కేసులో విచారణను అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాలని కోరారు.
సీబీఐ, ఈడీల అభ్యర్థనల మేరకు తదుపరి విచారణకు సంబంధించి ఎలాంటి తేదీని వెల్లడించకుండా నిరవధిక వాయిదా వేసింది ధర్మాసనం. దర్యాప్తు ముగిసిన తర్వాత ఎప్పుడైనా తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
కార్తి అభ్యర్థనకు సుప్రీం నిరాకరణ..
ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీకి సుప్రీం కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. విదేశాలకు వెళ్లేందుకు గతంలో కోర్టు రిజిస్ట్రీలో జమచేసిన పూచీకత్తు సొమ్ము రూ.10 కోట్లు విడుదల చేయాలన్న అభ్యర్థనను జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. మరో మూడు నెలల పాటు పూచీకత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్రత్యేక గది మినహా సాధారణ ఖైదీల్లానే చిదంబరం