నేతల భిన్నాభిప్రాయాలు
దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్, ఇతర ముఖ్య నాయకులు దిల్లీలో ఆమ్ఆద్మీతో కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించారు. పొత్తులపై ఈ సమావేశంలో పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని ఏకగ్రీవంగా నిర్ణయించారు నేతలు.
దిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ మాకెన్, సుభాశ్ చోప్రా, తజ్దార్ బాబర్, అరవింద్ సింగ్‌లు ఆప్‌తో పొత్తుపై సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్‌తో కూటమికి అనుకూలంగా ఉన్నట్లు 12 జిల్లాల అధ్యక్షులు, నాయకులు, మూడు పురపాలక కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖను రాహుల్ గాంధీకి అందించారు ఏఐసీసీ దిల్లీ ఇన్ఛార్జీ పీసీ చాకో.
దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్, వర్కింగ్ ప్రెసిడెంట్లు దేవేందర్ యాదవ్, రాజేశ్ లిలోతియా, హరూన్ యూసుఫ్‌లు ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఆప్
కాంగ్రెస్‌తో పొత్తుకు ఆమ్ఆద్మీ సుముఖంగా ఉంది. కాంగ్రెస్ మాత్రం ఎటూ తేల్చలేదు. దీంతో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఆమ్ ఆద్మీ. కూటమి ఏర్పాటుపై కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆప్ పేర్కొంది. దిల్లీలో ఒంటరిగానే పోటీ చేసి ఏడు స్థానాలను గెలుచుకునే సత్తా తమ పార్టీకి ఉన్నట్లు ఇప్పటికే ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గత మంగళవారం కూటమి ఏర్పాటుపై ఆప్‌ను సంప్రదించారు ఎన్సీపీ అధినేత శరద్ పవర్. దిల్లీతో పాటు పంజాబ్, హరియాణాలో సైతం కూటమి ఏర్పాటుకు సహకరించాలని ఆప్‌ను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.