మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఆరు నెలల్లోపు మరణశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న.. దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. 13 రోజులుగా దీక్ష చేస్తున్న స్వాతి.. అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న తరుణంలో ఆమెను హుటాహుటిన దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.
ఆరోగ్యం క్షీణించినా..
స్వాతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు శనివారం సమీక్ష నిర్వహించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని తెలిపారు. రక్తంలో యూరిక్ ఆమ్లాలు ప్రమాదకర స్థాయికి చేరాయని వెల్లడించారు. ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించగా... అందుకు స్వాతి నిరాకరించారు. దీక్షను అలాగే కొనసాగించారు.
ప్రధానికి లేఖ..
అత్యాచార దోషులకు ఆరు నెలల్లోపు మరణశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3వ తేదీన నిరాహార దీక్ష చేపట్టారు స్వాతి. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకురావాలని కోరారు.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా దిశ బిల్లు తెచ్చేవరకు దీక్ష విరమించను'