పంజాబ్, హరియాణా రైతుల నిరసనలతో దిల్లీ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. ట్రాక్టర్ ట్రాలీలు, ఇతర వాహనాలలో పెద్ద ఎత్తున రైతులు రాజధానికి చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను వ్యతిరేకిస్తూ 'ఛలో దిల్లీ' నినాదం అందుకున్నారు. నగర శివార్లలో ఉన్న బురారీ మైదానంలో నిరసన చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ రైతులు రోడ్లపైనే బైఠాయించి నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. నగరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు.
గురువారం ప్రారంభమై..
గురువారం వేలాది మంది రైతులు పంజాబ్ నుంచి హరియాణాకు చేరుకున్నారు. హరియాణా సరిహద్దులో వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. నీటి ఫిరంగులు, భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయితే తర్వాత వారికి రాష్ట్రంలోకి అనుమతించారు. భాజపా అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలోకి చేరుకున్న తర్వాతా.. పలు చోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. పానిపత్లో రైతులు బస చేశారు.
శుక్రవారం దిల్లీ సరిహద్దులో నిరసన చేశారు రైతులు. బ్యారికేడ్లను దాటి రైతులు రాకుండా అడ్డుకునేందుకు భాష్పవాయు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు.
పంజాబ్, హరియాణా నుంచి భారీగా రైతులు తరలివస్తుండటం వల్ల దిల్లీ పరిసరాల్లో శనివారం సైతం ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
రైతుల ఆందోళనకు కారణం?
సంస్కరణల పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వ్యవస్థను రద్దు చేస్తాయని పంజాబ్, హరియాణాలోని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కాలక్రమేణా పెద్ద కార్పొరేట్ సంస్థలకే ఈ చట్టాలు మేలు చేస్తాయని చెబుతున్నాయి. వ్యవసాయం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని, తద్వారా తమ పంటలకు సరైన ధర లభించదని వాదిస్తున్నాయి. మండీ వ్యవస్థ రద్దు ద్వారా మద్దతు ధర కోల్పోతామని స్పష్టం చేస్తున్నాయి.
డిమాండ్లు ఏంటంటే..
తమ పంట అమ్మకాలను నియంత్రించే మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. ఎంఎస్పీ వ్యవస్థ కొనసాగించేలా న్యాయపరమైన హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎంఎస్పీని చట్టాల్లో పొందుపర్చాలని స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమలులోకి వస్తే తమకు సబ్సిడీతో కూడిన విద్యుత్ లభించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వ్యర్థాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చే నియమాలు తమకు వర్తింపజేయొద్దని అంటున్నారు.
నిరసనల వెనక ప్రధాన హస్తం
ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ 'ఛలో దిల్లీ' పిలుపునిచ్చింది. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్, భారతీయ కిసాన్ యూనియన్ వంటి సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ సంఘాలన్నీ కలిసి సంయుక్త కిసాన్ మోర్చా పేరిట నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘటన్, జై కిసాన్ ఆందోళన్, ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ, క్రాంతికారి కిసాన్ యూనియన్, భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ-దకౌండా), బీకేయూ-ఏక్తా ఉర్గాహన్, బీకేయూ-చదునీ సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి.
పంజాబ్ నుంచే అత్యధికంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. హరియాణా నుంచి ఓ మోస్తరు సంఖ్యలో రైతులు మద్దతు తెలుపుతున్నారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతులు కొంతవరకు నిరసనలకు తరలివెళ్తున్నారు.
దిల్లీ ఛలో నిరసనలకు ముందు పంజాప్, హరియాణా రాష్ట్రాల్లో రైతులు నిరసనలు చేశారు. రైల్ రోకో ఆందోళన రెండు నెలల పాటు కొనసాగింది.
మూడు బిల్లులకు వ్యతిరేకంగానే రైతులు ప్రధానంగా నిరసన చేస్తున్నారు. ఈ బిల్లుల వివరాలు, వీటిపై కేంద్రం వైఖరి గురించి తెలియాలంటే కింది కథనాలను చదివేయండి.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?
వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా