కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు ప్రస్తుత లోక్‌సభను రద్దు చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అనంతరం 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కానుంది.
16వ లోక్‌సభకు జూన్ 3 వరకు గడువుంది. ఈ లోగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుత లోక్‌సభను ముందే రద్దు చేయాలని మంత్రి వర్గం శుక్రవారం నిర్ణయించింది.
మోదీ స్వయంగా.. మంత్రి మండలి రాజీనామా, లోక్‌సభ రద్దు ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. మోదీ, మంత్రి వర్గం రాజీనామాలను అదే రోజు ఆమోదించిన కోవింద్.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. వచ్చే వారం నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.
ఇటీవల ప్రకటించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. 542 స్థానాలకు గాను 348 సీట్లు గెల్చుకుంది. భాజపా 303 స్థానాల్లో గెలిచి... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సొంతంగానే సాధించింది.
విజేతల జాబితా అందజేత...
17వ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు ఎన్నికల సంఘం అధికారులు. కోవింద్‌ను కలిసిన వారిలో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా ఉన్నారు.