తూర్పు లద్దాక్ సహా చైనా సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో సైన్యం పరిస్థితిపై ఆరా తీశారు. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-చైనా మధ్య మేజర్ జనరల్ స్థాయిలో మరోసారి చర్చలు జరగాల్సి ఉండగానే.. రక్షణమంత్రి సైనిక సన్నద్ధతపై సమీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె, నౌకాదళ ప్రధానాధికారి కరంబీర్ సింగ్, వాయుసేన చీఫ్ బదౌరియా ఈ సమావేశానికి హాజరయ్యారు. తూర్పు లద్దాఖ్‌లో సైన్యం పరిస్థితిపై రాజ్‌నాథ్‌కు కూలంకషంగా వివరించారు నరవాణె. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితని చేయి దాటిపోనివ్వద్దని, భారత వాదనపై పటిష్ఠంగా నిలవాలని అగ్రశ్రేణి రక్షణ అధికారులకు రాజ్‌నాథ్ సూచించారని తెలుస్తోంది.
భారత్, చైనా ఆర్మీ మధ్య పాంగాంగ్, గాల్వన్ లోయ, దెమ్‌చొక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల వద్ద ఐదువారాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుదేశాలు అదనపు సైనిక బలగాలను సరిహద్దు వెంట మోహరించాయి. ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఇప్పటికే మేజర్ జనరల్స్ స్థాయిలో సమావేశం జరిగింది. వచ్చేవారం ఫీల్డ్ కమాండర్ స్థాయిలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులో సైనిక సన్నద్ధతపై రక్షణమంత్రి సమీక్ష చేశారని తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి