యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌కు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి ఎంపికయ్యారు.
క్షిపణి సాంకేతికతలను స్వదేశంలో అభివృద్ధి చేయడానికి సతీష్ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఫెలోషిప్ అందిస్తున్నట్లు సొసైటీ పేర్కొంది. వైవిధ్యభరితమైన క్షిపణి వ్యవస్థలు, ఏరోస్పేస్ వాహనాలు, గైడెడ్ ఆయుధాలు, విమానయాన సాంకేతికతలను అభివృద్ధి, రూపకల్పనలలో సతీష్ రెడ్డి అందించిన సేవలను ప్రస్తావిస్తూ ప్రకటన విడుదల చేసింది రాయల్ ఏరోనాటికల్ సొసైటీ.
"భారతదేశ తొలి యాంటీ శాటిలైట్ మిషన్ టెస్ట్ అయిన 'మిషన్ శక్తి'కి సతీష్ మార్గనిర్దేశనం చేశారు. అత్యున్నత సాంకేతికత సహా అత్యంత కచ్చితత్వం ఉన్న మిషన్ శక్తి రాకతో ప్రపంచంలో ఈ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల జాబితాలో భారత్ చేరింది. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను మరింత పటిష్టం చేశారు. సుదీర్ఘ పరిధి కలిగిన అధునాతన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. సతీష్ రెడ్డి సేవల వల్ల భారత్ క్షిపణి సాంకేతితకలో స్వయం సమృద్ధి సాధించింది. అధునాతన సాంకేతికతలో ఆయనకున్న ఉన్నతమైన నైపుణ్యాలు 'జూనియర్ కలాం', 'తర్వాతి తరం మిస్సైల్ మ్యాన్' వంటి పేర్లు సతీష్‌కు తెచ్చిపెట్టాయి."
-రాయల్ ఏరోనాటికల్ సొసైటీ ప్రకటన
గత వందేళ్ల అవార్డు చరిత్రలో సతీష్ రెడ్డి భారత్ నుంచి ఎంపికైన తొలి వ్యక్తి కావడం విశేషం.