చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 3 రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు బయలుదేరారు. ఈ పర్యటనలో రష్యాలోని కీలక రాజకీయ నాయకులతో రాజ్‌నాథ్ భేటీ కానున్నారు. లద్ధాఖ్‌లో నెలకొన్న పరిస్థితులు, చైనా ఏర్పాటు చేసుకున్న స్థావరాలకు సంబంధించి వివరించనున్నారు.
ఈ పర్యటనలోనే యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకుల కోసం విడిభాగాలు, అనుబంధ పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రష్యాను కోరనున్నట్లు తెలుస్తోంది.
"వైమానిక దళానికి సుఖోయ్-30 ఎంకేఐ, మిగ్-29, నౌకాదళానికి మిగ్- 29కే, కిలో క్లాస్ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, సైన్యానికి టీ-90 ట్యాంకులను రష్యా విక్రయించింది. వీటికి సంబంధించిన విడిభాగాలు, పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రక్షణ మంత్రి కోరనున్నారు."
- ప్రభుత్వ వర్గాలు
రష్యా నాయకులతో చర్చల సందర్భంగా, వచ్చే ఏడాది చివరి నాటికి సరఫరా చేయాల్సిన ఎస్- 400 వైమానిక రక్షణ వ్యవస్థల పంపిణీని వేగవంతం చేయాలని రక్షణ మంత్రి వారిని కోరనున్నారు. చెల్లింపుల్లో సమస్యల కారణంగా ఎస్-400 అందించటంలో ఆలస్యం జరిగింది.
అత్యాధునిక సాంకేతికత...
ఎస్- 400 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే వ్యవస్థగా దీనిని పిలుస్తారు. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.