సార్వత్రిక ఎన్నికల వేళ వాస్తవ సమస్యలపై ప్రజల దృష్టిని కేంద్రీకృతం చేసేలా వివిధ ప్రజాసంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. స్వరాజ్ అభియాన్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ 'నా దేశం- నా ఓటు- నా సమస్య' పేరిట ప్రచారం చేపడుతున్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ప్రాణాలు త్యాగం చేసిన రోజైన మార్చి 23న దిల్లీలోని అమరువీరుల పార్కులో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ఈటీవీ భారత్‌తో వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు యోగేంద్ర యాదవ్.
ప్ర: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వాస్తవ అంశాలేంటి?
జ: దేశం మొత్తం మాట్లాడుకోవాల్సిన వాస్తవ అంశాలు... రైతు సమస్యలు, రైతు ఆత్మహత్యలు పెరగటం, వారి ఆదాయం తగ్గిపోవటం, రైతు కూలీల ఆదాయం తగ్గిపోవటం వంటివి.
మరో వాస్తవ అంశం నిరుద్యోగం. ప్రస్తుతం దేశంలో ఉన్న నిరుద్యోగం చరిత్రలోనే అత్యధికం. మరిన్ని అంశాలు... విద్య, ఆరోగ్యం, వాతావరణం, అడవిపై ఆధారపడ్డవారి హక్కులు. ఇవన్నీ వాస్తవంగా చర్చకు రావాల్సిన అంశాలు. దీన్ని దేశ భద్రత అంశానికి మరల్చటానికి చేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగినది కాదు. దీన్ని అంగీకరించటానికి మేము సిద్ధంగా లేము.
అందుకే అన్ని ప్రజా ఉద్యమ సంఘాలు ఒక దగ్గరకు వచ్చి... ఒక ప్రచారాన్ని మొదలుపెట్టాం. దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాం. ఒకే భావజాలం ఉన్న సంఘాలు కలిసి ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించటానికి ఒకే తరహా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా, వ్యతిరేకంగా కాకుండా... వాస్తవ అంశాలను ఎన్నికల చర్చలోకి తీసుకురావటానికి ప్రచారం నిర్వహిస్తాం.
ప్ర: ఈ ప్రచారం వల్ల అవగాహన రావచ్చు. కానీ ప్రజలకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి?
జ: ఇప్పటివరకు మేము కేవలం ప్రశ్నలు అడగమని చెబుతున్నాం. రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపించటం లేదు. అది మా పరిధి కాదు. ఈ పరిధిని మేము ఏదో ఒక సమయంలో తొలగించాలి. రాజకీయ పార్టీలు వాస్తవ అంశాలపై ఎన్నికల్లో పోటీపడాలని కోరుకుంటున్నాం. అప్పుడు ఎవరు గెలిచినా దేశానికి మంచిదే. ఎన్నికలు పక్కదోవ పట్టకూడదు. ఇప్పటికైతే పక్క దారి పట్టాయి. దీనిని మేము మళ్లీ గాడిలో పెట్టాలనుకుంటున్నాం.
ప్ర: ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏంటి? ఎప్పటి నుంచో సంక్షోభంలో ఉన్న రైతులు, యువతకు మీరిచ్చే సూచన.?
జ: మేమిచ్చే ఏకైక సందేశం 'దేశం నాది, ఓటు నాది, సమస్య నాది'. ఓట్లు అడగటానికి వచ్చిన ఎవరినైనా... గత ఐదేళ్లలో ఏం చేశారో, రానున్న ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పమని అడగండి.