భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు... గత రెండు సంవత్సరాలుగా ఎగువసభలోని కొన్ని వర్గాల ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. 'బిల్లుల ఆమోదం'పై అధికార, విపక్షాల మధ్య విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల సంఘం ముంబయిలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఆదర్శంగా ఉండాలి
పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా సాగడానికి, సమర్థంగా నిర్వహించడానికి ఎంపీలందరూ సహకరించాలని, ఆదర్శవంతమైన ప్రవర్తనతో మెలగాలని వెంకయ్య సూచించారు.
"రాజ్యసభ ఛైర్మన్గా... సభ్యులు సభా సంప్రదాయాలు, ప్రవర్తనా నియమావళి, నిబంధనల్ని ఉల్లంఘించడం నన్ను తీవ్రంగా బాధిస్తుంటుంది. ఇది కాస్తా గందరగోళానికి దారితీస్తుంది. ఫలితంగా ప్రజల దృష్టిలో సభకున్న గౌరవం తగ్గుతుంది."
-వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
చట్టసభల్లో ఆందోళనలు చేయడం, అంతరాయం కలిగించడం, సభా కార్యక్రమాలను ఆటంకపరచడం ... ఇవేవీ ప్రజాస్వామ్య లక్షణాలైన 'చర్చ, తర్కం, నిర్ణయం తీసుకోవడాన్ని' భర్తీ చేయలేవని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
అధికార, విపక్షాలు కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కారని ఆయన అన్నారు. ఇరువురూ ప్రజాసేవ చేయడానికి పోటీపడాలని హితవు పలికారు.
స్థానిక సంస్థలకు.... అధికారాల పంపిణీ
రాజ్యాంగబద్ధ అధికారం పొంది 26 సంవత్సరాలు గడుస్తున్నా...స్థానిక సంస్థలకు ఇంకా అధికారాల పంపిణీ సంతృప్తికరంగా జరగలేదని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మూడు 'ఎఫ్'లు.. నిధులు, విధులు, కార్యనిర్వాహకులను పంపిణీ చేయాలని వెంకయ్య స్పష్టం చేశారు. రాష్ట్రాలు వెంటనే పంచాయతీ రాజ్ సంస్థలకు అధికారాలు బదిలీ చేయాలని, ఇంకా ఆలస్యం చేయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుందని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: బాత్రూంకని చెప్పి ఈడీ ఆఫీస్ నుంచి బయటకు!