కేంద్ర ఎన్నికల సంఘం నేడు సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై నేడు నిర్ణయం తీసుకోనుంది. సంబంధిత వివరాలు ఈసీ ముందుంచారు అధికారులు.
ప్రతి మంగళ, గురువారాల్లో ముఖ్యమైన విషయాలపై ఈసీ సమావేశమవుతుంది. మోదీ, రాహుల్, షా వ్యాఖ్యలపై నేడు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కమిషన్ సభ్యులందరూ హాజరుకానున్నారు.
రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో సైన్యం చర్యల గురించి ప్రస్తావించరాదని మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది ఈసీ. అయితే మోదీ, అమిత్ షాలు తమ ప్రసంగాల్లో సైన్యాన్ని ప్రస్తావించినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి.
మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఫిర్యాదు అందింది. దీనిపైనా నేడు ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
సుప్రీంలో విచారణ...
మోదీ, అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ ఎంపీ సుశ్మితా దేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది.
సుప్రీం విచారణ రోజే ఈసీ సమావేశమవుతుండటం గమనార్హం. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ ఎన్నికల అధికారి సందీప్ సక్సేనా.. నేటి సమావేశం వారం క్రితమే నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
జమ్ము ఎన్నికలపైనా చర్చ!
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపైనా ఈసీ చర్చించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న హోంమంత్రిత్వశాఖ సమాచారం మేరకు జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది.
- ఇదీ చూడండి: జేఈఈ మెయిన్స్‌లో 24 మందికి 100కి వంద