బిహార్‌లో అనుమానిత అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్-ఏఈఎస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముజఫర్‌పుర్‌లో నేడు మరికొందరు పసివాళ్లు ప్రాణాలు విడిచారు. ఫలితంగా ఏఈఎస్కు బలైన వారి సంఖ్య 104కు చేరింది.
ఎన్హెచ్ఆర్సీ నోటీసులు...
చిన్నారుల మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తీసుకొన్న చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
పదేళ్ల లోపు చిన్నారులే...
పదేళ్ల లోపు చిన్నారులే ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. జూన్ 1 నుంచి 197 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు. బిహార్‌లోని 12 జిల్లాల్లో 222 ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
వైద్యులు మాత్రం... చిన్నారుల మృతికి ఏఈఎస్ (మెదడు వాపు వ్యాధి) కారణం కాదని, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం(హైపోగ్లైసీమియా) వల్లనే వారు చనిపోతున్నారని చెప్పారు. "గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, ఇతర కారణాల వల్ల రాత్రిపూట పిల్లలు ఆహారం తీసుకోవడంలేదు. ఇలా ఖాళీ కడుపుతో నిద్రపోతే పిల్లల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గే ప్రమాదముంది" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- ఇదీ చూడండి: బంగాల్: చర్చలు సఫలం- వైద్యుల సమ్మె విరమణ